09/05/2026
తేదీ : 09-05-2026
వనపర్తి జిల్లా
*రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి*
*ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" లో భాగంగా విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*
జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు, జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యాశాఖ వారోత్సవాలు సహా పలు అంశాలపై హైదరాబాదు నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ హాజరయ్యారు.
సి ఎస్ మాట్లాడుతూ జనగణన 2027 లో భాగంగా సెల్ఫ్ ఏన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అత్యధిక శాతం ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది అందులో పాల్గొని తమ వివరాలను నమోదు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల వారీగా స్వీయ జనగణన పై సమీక్షించిన సిఎస్ ప్రభుత్వ అధికారులు సిబ్బంది అందరూ స్వీయ గణన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి వేగవంతం చేయాలని, త్వరగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 100% పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యాశాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. వారోత్సవాల్లో ప్రతిరోజు నిర్దేశించిన విధంగా రోజువారి కార్యక్రమాలను చేపట్టి ప్రజాప్రతినిధులను అందులో భాగస్వామ్యం చేయాలని తెలియజేశారు.
వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు పడితే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ధాన్యం నిల్వ చేయడానికి గొడౌన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రతిరోజు నివేదిక అందించాలని సూచించారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఏం లేకుండా చూడాలని ఆదేశించారు.
మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో పనుల శంకుస్థాపనలు, ఎస్ ఎస్ సి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ప్రత్యేక విద్య శిబిరాల నిర్వహణ, వర్క్ షాప్ ల ఏర్పాటు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకుల సమావేశాలు, లైబ్రరీ డే, విద్యా వేడుకల కార్యక్రమాలు నిర్ణిత ప్రణాళిక ప్రకారం రోజువారి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యా శాఖలో చేపడుతున్న కార్యక్రమాలపై అన్ని గ్రామాల సర్పంచులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అదేవిధంగా జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసి 100% పూర్తయ్యేలా ఏఈఓ లకు లక్ష్యాలను నిర్దేశించాలని సూచించారు. ఇందుకు సంబంధించి రోజువారి నివేదికను సమర్పించాలని వ్యవసాయ అధికారికి సూచించారు. జనగణన ప్రక్రియకు సంబంధించి, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
సమావేశంలో సిపిఓ హరికృష్ణ, డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, డి ఎం ఆంజనేయులు, డీఏవో ఆంజనేయులు, డి డబ్ల్యు ఓ సుధారాణి, విద్యాశాఖ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy
Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana