25/05/2026
క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుధ్ధసన్నాహాలను తీవ్రంగా నిరసిస్తూ ప్రపంచవ్యాపిత ఐక్య ప్రతిఘటనకై SUCI(C) పార్టీ పిలుపు!
-కామ్రేడ్ ప్రవాష్ ఘోష్, ప్రధాన కార్యదర్శి, ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్ట్)
అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ రహస్య సైనిక చర్య ద్వారా వెనిజులా అధ్యక్షుడు మదురోను అపహరించిన తర్వాత, తన తొత్తు జియోనిస్ట్ ఇజ్రాయెల్‌ను వెంటబెట్టుకుని ఇరాన్‌పై నిష్కారణంగా, అమానవీయ సాయుధ దాడి చేసిన అమెరికా సామ్రాజ్యవాదులు, ఇప్పుడు సోషలిస్టు క్యూబాపై తమ దాడిని ఎక్కు పెట్టారు. కఠినమైన ఆంక్షలు, చమురు దిగ్బంధంతో క్యూబాను ఉక్కిరిబిక్కిరి చేసి తీవ్ర ఇంధన సంక్షోభం, సామాజిక-ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారు.
యుద్ధ పిపాసి అమెరికా సామ్రాజ్యవాద అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని విస్తరించడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. క్యూబా ప్రభుత్వాన్ని కూల్చి, మొత్తం లాటిన్ అమెరికాపై అడ్డులేని ఆధిపత్యాన్ని స్థాపించాలని ట్రంప్ చూస్తున్నాడు.
1959 లో క్యూబా విప్లవం ద్వారా అమెరికా అండదండలున్న నిరంకుశ బటిస్టా పాలనను కూలదోసిన తర్వాత, క్యూబా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లాటిన్ అమెరికా ప్రజల పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. అప్పటి నుండి అమెరికా పదేపదే కుట్రలు చేసి ప్రతీఘాత-విప్లవాన్ని రెచ్చగొట్టి క్యూబా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించింది, కానీ పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు సంపూర్ణ ఆర్థిక దిగ్బంధం విధించి, క్యూబా ప్రజలకు తీవ్ర సంక్షోభం సృష్టించి, మాజీ క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై తప్పుడు ఆరోపణలు చేసి ఆ సాకుతో క్యూబాపై దాడి చేయాలని చూస్తోంది.
కానీ ధైర్యవంతులైన క్యూబా ప్రజలు తలవంచడానికి నిరాకరిస్తున్నారు. ‘మాతృభూమి రక్షణ లేదా మరణం మాముందున్న మార్గం– మేము గెలుస్తాం’ అని ధైర్యంగా ప్రకటించారు. మేము అన్ని దేశాలలోని సామ్రాజ్యవాద వ్యతిరేక, స్వాతంత్ర్య కాంక్షిత ప్రజలతో కలిసి పోరాడుతాం .
శక్తివంతమైన సోషలిస్టు శిబిరం లేని నేపథ్యంలో అడ్డూఅదుపూ లేని అమెరికా సామ్రాజ్యవాదుల అంతర్జాతీయ గూండాయిజాన్ని, పెత్తందారీతనాన్ని ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్టు) పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. క్యూబాను కూల్చివేసి ఆ భూమిపై తమ ఆధిపత్యాన్ని స్థాపించాలన్న రాక్షస అమెరికా సామ్రాజ్యవాదుల, వారి అనుచరుల దుష్ట కుట్రలను అడ్డుకోవడానికి ప్రపంచంలోని సామ్రాజ్యవాద వ్యతిరేక, శాంతికాముక ప్రజలందరూ ముందుకు రావాలని పార్టీ పిలుపునిస్తోంది.
23-05-2026