25/08/2016
పవన్ కల్యాణ్ అంటే తన బిడ్డకు పిచ్చి అభిమానమని, మరణంలో పవనిజాన్ని చూపించిన తన కుమారుడు, స్వర్గంలో కూడా పవనిజాన్ని చూపిస్తాడని వినోద్ తల్లి వేదవతి అన్నారు. తన బిడ్డే కాకుండా తాను కూడా చిన్నప్పటి నుంచే మెగాస్టార్ అభిమానినని, ఆ కుటుంబం మాటలు నమ్మి సేవ చేస్తున్నందుకే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘మావాడు చిన్నప్పటి నుంచే పవన్ ఫ్యాన్. పవన్ లాగానే గడ్డం పెంచడం, కేన్సర్ రోగులకు సహాయం చేయడం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పుస్తకాల నిండా.. పవన్ నినాదాలే ఉండేవి. అమెరికా వెళ్లి పవనిజాన్ని వ్యాప్తి చేస్తానన్నాడు. అదినచ్చకే.. వాళ్లు నా బిడ్డను చంపేశారు. నా బిడ్డ ఆశయాలను నెరవేర్చేందుకు పవన్‌తో కలిసి నడుస్తాను. నాకు న్యాయం చేయడానికి పవన్ ఎంత దూరం అయినా వెళ్తారు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాట ఇస్తే ప్రాణం అడ్డం పెట్టే మనిషి పవన్ కల్యాణ్ మేము చిన్నప్పటి నుంచి మెగాఫ్యామిలీ అభిమానులం. వాళ్లు ఎగుడుదిగుడు మనుషులు కాదు. కష్టపడి పైకొచ్చినోళ్లు. నేను వాళ్లను దేవుడ్ని నమ్మినట్లు నమ్ముతాను. నా బిడ్డ పవన్ నా దేవుడు అంటాడు. అటువంటి నా బిడ్డ మాటను నేను వినాలి కదా? నమ్మాలి కదా? నా బిడ్డ మాట విని నేను కూడా కళ్లు దానం చేశాను. మావాడు అమెరికా వెళ్లి పవనిజాన్ని వ్యాప్తి చేస్తానన్నాడు. మేం ఎటువంటి అడ్డు చెప్పలేదు. మావాడు ఇప్పుడు స్వర్గంలో కూడా పవనిజాన్ని చూపిస్తాడు. మరణంలో కూడా పవనిజాన్ని చూపించి పోయాడు. మా బిడ్డ అటువంటి గొప్ప బిడ్డ’ అని వేదవతి ఏబీఎన్‌తో చెప్పారు.