11/12/2025
*అసత్యాలు రాస్తే ఖబడ్దార్.. లీగల్ చర్యలు తప్పవు!*
- *వెంపల్లె టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి వార్నింగ్*
వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అసత్య వార్తలు రాస్తే సహించేది లేదని, అలాంటి వారిపై చట్టపరంగా (లీగల్) కఠిన చర్యలు తీసుకుంటామని వెంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తనపై జరుగుతున్న విషప్రచారాన్ని, భూకబ్జా ఆరోపణలను ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.
ఈ సందర్భంగా రఘునాథరెడ్డి గారు మాట్లాడుతూ.. "నేను ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు. మాది వ్యవసాయ కుటుంబం. రైతు బిడ్డగా వ్యవసాయం చేసుకుంటూ, మరోవైపు ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప.. అక్రమార్జన కోసం కాదు. నేను పంచాయితీలు చేసి డబ్బులు సంపాదిస్తున్నానని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నాకు ఎలాంటి ఫ్యాక్టరీలు గానీ, బినామీలు గానీ లేవు" అని స్పష్టం చేశారు.
పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వరుస చేరికలను చూసి ఓర్వలేకే, కొందరు గిట్టనివారు తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇకపై వాస్తవాలు తెలుసుకోకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్యాలు రాస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.