24/12/2025
🚌 నిడదవోలు డిపో అభివృద్ధి ప్రయాణం – ఒక సంకల్ప గాథ 🚌
నిడదవోలు డిపో పునఃప్రారంభం 2015 సంవత్సరంలో కేవలం 18 బస్సులతో జరిగింది. ఆ తర్వాత 2018 వరకు విధులు నిర్వహించిన డిపో మేనేజర్లు అపారమైన కష్టపడి, డిపో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో బస్సుల సంఖ్యను 37 వరకు పెంచారు. అందులో 2 హైదరాబాద్ సర్వీసులు, 1 విజయవాడ అల్ట్రా డీలక్స్ సర్వీస్ ఉండేది.
2019లో “నిడదవోలు డిపో వెల్‌విషర్స్” అనే పేరుతో కొంతమంది ఆర్టీసీ శ్రేయోభిలాషులు ఒక బృందంగా ఏర్పడి, డిపో అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కారణంగా అల్ట్రా డీలక్స్ సర్వీస్ నిలిచిపోయింది. కరోనా అనంతరం ఒక హైదరాబాద్ సర్వీస్ కూడా రద్దయ్యింది.
2018లో నిడదవోలు డిపోను అనుబంధ డిపోగా మార్చుతామని ప్రకటించిన సమయంలో అప్పటి డిపో మేనేజర్ కృషి ఫలితంగా 2 విశాఖపట్నం సర్వీసులు ప్రారంభమయ్యాయి.
2020 నుంచి నిడదవోలు డిపో క్రమంగా క్షీణిస్తూ వచ్చి, చివరకు 2024 నాటికి కేవలం 33 బస్సులకే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లోనూ మా “డిపో వెల్‌విషర్స్” బృందం వెనుకడుగు వేయలేదు.
2020లో విజయవాడకు ఒక ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ను తీసుకొచ్చి నడిపించాము. మరల దాన్ని 2023 లో 2 బస్ లు చేసాము, అది కొందరి అలసత్వం కారణం గా రద్దు అయ్యాయి, విశాఖపట్నం సర్వీస్ నిలబడాలనే లక్ష్యంతో రాత్రి పగలు నిద్రలేకుండా సర్వీస్ ఆదాయం, ప్రయాణికుల స్పందనపై నిరంతరం గమనించాము. ప్రజలకు సర్వీస్ ఉందని తెలియజేయడానికి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాము.
హైదరాబాద్ సర్వీస్ ద్వారా ఆదాయం పెంచేందుకు మేము సాధ్యమైన అన్ని సలహాలు, సూచనలు అందించాము. ప్రతి కార్తీక మాసంలో స్పెషల్ సర్వీసులు నడపాలని ప్రతిపాదించాము. శబరిమల యాత్రలకు, అరుణాచలం దర్శనాలకు, కోనసీమ శైవ క్షేత్రాలకు స్పెషల్ ట్రిప్పులు నిర్వహించాము. అనేక మ్యారేజ్ స్పెషల్ సర్వీసులు మా చేతుల మీదుగా బుక్ చేయించాము. ఇటీవల కుంభమేళాకు రెండు బస్సులను పంపించగలిగాము.
అంతేకాకుండా భీమవరం సర్వీస్ ను ఎంతో పోరాటంతో అనుమతులు తెచ్చి ప్రారంభించాము. ప్రతి బస్సును డిపో మేనేజర్ గారితో చర్చించి, అందంగా ఉండేలా, డిపోకు లాభాలు తెచ్చేలా నిర్వహిస్తున్నాము. చిత్తూరు నుండి వచ్చిన 25 మంది సిబ్బంది బదిలీ కావడంతో సిబ్బంది కొరత ఏర్పడినా, మా వంతు ప్రయత్నంగా సిబ్బందిని సమకూర్చుతూ, డిపోలోని అన్ని సర్వీసులు / షెడ్యూల్స్ తిరిగేలా కృషి చేస్తున్నాము.
33 బస్సుల నుంచి అందులో 3 బస్ లు స్క్రాప్ అవ్వగా మళ్లీ 2024 నాటికి 35 బస్సులకు డిపోను తీసుకురాగలిగాము. అప్పటి డిపో మేనేజర్ గారి సహకారంతో కాకినాడకు ఒక నూతన సర్వీస్ ను కూడా ప్రారంభించాము. ప్రస్తుతం 37 బస్సు లు ఉన్నాయి. సరికొత్త BS 6 బస్ లను నరసాపురం డిపో తో సమానం గా మనకి అవసరం లేకపోయినా 3 బస్ లను డిమాండ్ చేసి మార్చాము.
2025లో కాకినాడకు రెండో సర్వీస్, హైదరాబాద్‌కు రెండో సర్వీస్ తిరిగి ప్రారంభించాలనే లక్ష్యంతో, గత ఏడు సంవత్సరాలుగా ఒకే ఒక్క వ్యక్తి విక్రమార్కుడిలా అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. చెప్పులు అరిగేలా తిరుగుతూ, నిడదవోలు డిపో అభివృద్ధి చెందాలి, సర్వీసులు పెరగాలి, డిపో పెద్దదిగా మారాలి అనే సంకల్పంతో ఆయన శ్రమిస్తున్నారు.
డిపో మేనేజర్ గారికి ప్రమోషన్ వచ్చి వెళ్లిపోయిన సమయంలో, ట్రాఫిక్ ఇన్‌చార్జ్ కూడా లేకుండా డిపో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి, కొత్త డిపో మేనేజర్‌ను, ట్రాఫిక్ ఇన్‌చార్జ్‌ను నియమింపజేయడంతో పాటు 10 మంది సిబ్బందిని తీసుకురాగలిగిన ఘనతను మేము గర్వంగా చెప్పుకుంటున్నాము.
ప్రస్తుతం మేము ఇచ్చిన మాట ప్రకారం, హైదరాబాద్ సర్వీస్ లో ఒకదాన్ని ఏసీ సర్వీస్ గా మార్చడం, ఉన్న విశాఖపట్నం సర్వీస్ ను ఇచ్చాపురం వరకు పొడిగించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఆలస్యం ఉండదు. ఇదే విధంగా మరిన్ని సర్వీసులు కూడా పెంచాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాము.
ఈ ప్రయాణంలో మాకు మన నిడదవోలు ప్రయాణికుల సహకారం, తోడ్పాటు ఎల్లప్పుడూ అవసరం.
నిడదవోలు డిపో అభివృద్ధి – అది మా బాధ్యత