13/05/2026
ఆక్వా రంగాన్ని కుప్పకూల్చుతున్న కూటమి ప్రభుత్వం
ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై మండిపడ్డ వైఎస్సార్ సిపి
తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆక్వా రైతులతో కలిపి ఉద్యమం చేస్తాం .. వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు
భీమవరం :
కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను నిలువునా ముంచేస్తుందని, ఆక్వా రంగాన్ని కుప్పకూల్చుతుందని వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు మండిపడ్డారు. భీమవరం జిల్లావైఎస్సార్ సిపి కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్సార్ సిపి తీవ్ర స్థాయిలో స్పందించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని, ప్రభుత్వ పెద్దలు, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెలా ఫీడ్ కంపెనీల నుంచి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నాయని, అందుకే ధరల పెంపును అడ్డుకోలేదని విమర్శించారు. తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆక్వా రైతులతో కలిపి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, ప్రతి నెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఆక్వా రంగం అత్యంత దయనీయ స్థితికి చేరుకుందని, తక్షణమే ధరలు తగ్గించాలని లేని పక్షంలో ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారని, ఫీడ్ ధరలపై సుంకాలు తగ్గినప్పుడు టన్నుకు రూ 25 వేలు తగ్గించాల్సిన ప్రభుత్వం, కేవలం రూ 4 వేలు తగ్గించి చేతులు దులుపుకుందన్నారు. యూనిట్ విద్యుత్ కి రూ 1.50 సబ్సిడీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రెండేళ్లు కావస్తున్నా పైసా సబ్సిడీ ఇవ్వలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో 50,800 ఆక్వా కనెక్షన్లకు ఐదేళ్లలో రూ 3,640 కోట్లు సబ్సిడీగా ఇస్తే నేడు ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వకుండా 'సూపర్ సిక్స్' సూపర్ సక్సెస్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కావూరు శ్రీనివాస్, భీమవరం, ఉండి ఇన్ ఛార్జ్ లు చినిమిల్లి వెంకట్రాయుడు, పివిఎల్ నరసింహరాజు, పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గూడూరి ఉమాబాల, మేడిద జాన్సన్, ఏఎస్ రాజు లు మాట్లాడారు.