02/09/2024
గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి
పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం
కె. శివరాం రెడ్డి,నల్లగొండ డీఎస్పీ
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశానుసారం, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుటకు గాను అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని,పట్టణంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తు పటిష్ఠ భద్రతా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మండప నిర్వాహకులు విగ్రహ నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటు చేయుటకు నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm నందు వివరాలు పొందుపరిచి అప్లికేషన్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.
గణేష్ మండప నిర్వాహకులు పాటించవలసిన నిబంధనలు:
మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి. గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.
* షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ఉపయోగించాలి.
* గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి.
* గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
* అధిక శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఏర్పాటు చేయరాదు.
* మండపాల వద్ద రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
* గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను.
* గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.
* గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకుని, మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.
* గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.
* విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.
* మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100 గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
* సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలి.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు మున్సిపాలిటీ తరఫున అన్ని వసతులు కల్పిస్తూ నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పీస్ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుటకు పలు రకాల చూచనలు చెప్పారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి టూ టౌన్ సిఐ డేనియల్ ట్రాఫిక్ సిఐ క్రాంతికుమార్ ఎస్ఐలు సందీప్ శంకర్ సురేష్ మానస, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, పీస్ కమిటీ సెక్రటరీ , గోలి మధుసూదన్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, గుమ్మల మోహన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, కలీం, డా.ఖాన్ మరియు కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, సమద్ ఇంతియాజ్, అభిమన్యు శ్రీను, వేణుగోపాల్ రెడ్డి, జమాల్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.