14/11/2021
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
నవంబర్ 25, 26 న 24 గంటల ధర్నా
కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక ఆందోళన ప్రారంభమై సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా నవంబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో 24 గంటల నిరవధిక ధర్నాను నిర్వహించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య, కెచ్చల రంగయ్య, వ్య.కా.స రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలోని రైతు, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా సదస్సులు :- కేంద్ర కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలోని వరి కొనుగోళ్ళు, పోడు రైతుల సమస్యలపై ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు నవంబర్ 17 నుండి 23 వరకు ఉమ్మడి జిల్లా సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వరి కొనుగోళ్ళ విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. వానాకాలం వరి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది. కొనుగోలు కేంద్రాలను పెంచి, మద్దతు ధర సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాలల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, గోనె సంచుల కొరత లేకుండ చూడాలన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం దరఖాస్తు చేసుకున్న అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాల అమలులో భాగంగానే యాసంగిలో వచ్చే వరి కొనుగోలు చేయమని ప్రకటిస్తున్నదన్నారు. దేశంలో 2013 ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే రాష్ట్రంలో పండిన పంటతోపాటు అదనంగా అవసరమౌతాయని అన్నారు. ప్రపంచ ఆకలి సూచికలో భారత దేశం మన పొరుగున ఉన్న చిన్న దేశాల కంటే వెనుకబడి ఉందన్నారు. దాదాపు 20 కోట్ల మంది ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటుందన్నారు. వీరందరికి ఆహార ధాన్యాలను సరఫరా చేస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో పండిన ఆహార ధాన్యాలన్ని సరిపోతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించకుండా పేదలందరికీ ఆహార ధాన్యాలను సరఫరా చేయాలన్నారు. రైతులు పండించిన పంటలన్నింటికీ కనీస మద్దతు ధరల చట్టం ప్రకారం కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి రాష్ట్రంలోని కార్మిక, విద్యార్థి, యువజన, మేదావి, మహిళ, సామాజిక, గిరిజన, మైనార్టీ సంఘాలన్ని సహకరించాలని, ఈ డిమాండ్లకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలు కూడ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, పల్లపు ఉపేందర్‌రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్య, వ్య.కా.స రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.