19/06/2026
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హాజరయ్యారు.
రాష్ట్రంలో పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవరం ఉందని ఈ సందర్భంగా సబ్ కమిటీ అభిప్రాయపడింది. పర్యాటక కేంద్రాల్లోని ప్రభుత్వ భూములు, స్థలాలను సమర్థవంతంగా వినియోగించి ఖజానాకు ఆదాయాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించింది. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం రంగాల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని సబ్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. వారాంతాల్లో హెలీకాప్టర్ టూరిజాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో పర్యటకాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టూరిజం ఆస్తులు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవన్నారు. వాటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి సంపద సృష్టించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఆదాయ సమీకరణలో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
అటు లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులపై కేబినెట్ పబ్ కమిటీ సమీక్ష చేసింది. నిబంధనలు పాటించే క్రషర్ల నిర్వాహకులకు అనుమతులు ఇవ్వాలని సబ్ కమిటీ సభ్యులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుకను ఎగుమతి చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్లాబ్ అధారిత భూముల విలువ సవరణ వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రవాణాశాఖకు సంబంధించి ఆదాయం... వసూళ్లు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ కమిటీ సమీక్ష చేసింది. అందులో భాగంగా బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ల విషయంలో పన్నులపై రాష్ట్ర అధికారాన్ని సమర్థిస్తూ కేరళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు సబ్ కమిటీ గుర్తించింది. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన, విధానపరంగా తీసుకోవల్సిన అంశాలపై సబ్ కమిటీ చర్చింది. బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమాల ద్వారా ఆదాయ సమీకరణను సమీక్షించారు.