03/06/2026
పత్రికా ప్రకటన(03.06.2026)
కర్నూలు జిల్లా...
* క్రీడాస్ఫూర్తిని చాటాలి...
విజయోత్సాహంలో వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు.
* గుంపులో ఉన్నప్పుడు వ్యక్తిగత బాధ్యతను మరవకూడదు.
* ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర ద్వారా యువకులకు కౌన్సెలింగ్.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయం సాధించిన సందర్భంగా ఇటీవల కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్లో కొందరు యువకులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు బస్సుల అద్దాలను పగులగొట్టిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో పాల్గొన్న 18 మందిని కర్నూలు టూ టౌన్ పోలీసులు గుర్తించి సోమవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యువతలో అవగాహన కల్పించేందుకు కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీ సుధీర్ సండ్ర గారి ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర మాట్లాడుతూ...
అభిమాన జట్టు విజయం సాధించినప్పుడు ఆనందం వ్యక్తం చేయడం సహజమేనని, అయితే మాబ్ కల్చర్‌లో పడి వ్యక్తిత్వాన్ని, విలువలను, క్యారెక్టర్‌ను కోల్పోవడం సరికాదని తెలిపారు.
గుంపులో ఉన్నప్పుడు కొందరు "అందరూ చేస్తున్నారు కదా" అనే భావనతో తాము సాధారణంగా చేయని పనులు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఆస్తుల ధ్వంసం, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడం వంటి చర్యలు క్షణికావేశంలో జరిగినప్పటికీ వాటి ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని వివరించారు.
ప్రతి వ్యక్తి తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఒకసారి చేసిన చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు.
క్రీడలను క్రీడాస్ఫూర్తితో స్వీకరిస్తూ గెలుపు-ఓటములను సమానంగా చూడాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, కళాశాల యాజమాన్యం మరియు ఇతరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.