13/05/2026
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప పౌరులుగా ఎదగాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు.
ఒక సాధారణ కుటుంబం నుంచి కష్టపడి ఎదిగి సమాజంలో గుర్తింపు పొందిన కుమార్ గారి ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని మంత్రి గారు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పిన విలువలు జీవితంలో ఎంత ముఖ్యమో గుర్తుంచుకుని సమాజానికి ఉపయోగపడే దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులను ప్రోత్సహించడం ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కుటుంబ పరిస్థితులు, సామాజిక సమస్యల వల్ల కొంతమంది విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని, అలాంటి వారిని కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని కోరారు.
ప్రస్తుతం యువతలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి గారు, ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండేలా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
రాబోయే రోజుల్లో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం మరింత పెరుగుతుందని, విద్యార్థులు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా నాలెడ్జ్ పెంచుకునే దిశగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. పర్యావరణం, ఆరోగ్యం, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాతల సహకారంతో పాటు సిఎస్ఆర్ నిధుల ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని వెల్లడించారు.
భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలుస్తుందని, యువతే దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, కృషితో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి గారు ఆకాంక్షించారు.