10/10/2021
ఐ. పంగిడి పరిసర లారీ యజమానులకు నమస్కారాలతో...భారత శిక్షాస్మృతి ప్రకారం "వందమంది నేరస్థులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు.కాని ఒక నిరపరాధి శిక్షింపబడరాదు". చట్ట విరుద్ధంగా,సీనరేజ్ రుసుము ,ఆదాయ,వాణిజ్య ఫీజులు కట్టకుండా ; మైనింగ్ అనుమతులు,పర్యావరణ అనుమతులు,లైసెన్సులు లేకుండా సరుకును అమ్ముతున్న క్వారీ,క్రషర్ యజమానులను వదిలిపెట్టి, నిరపరాధులైన లారీ యజమానులపై కేసులు పెట్టి జరిమానాలు వేస్తుంటే మైనింగ్ అధికారులను ప్రశ్నించకపోవడం మన చేతకానితనం. దొంగ సారా అమ్మేవాడ్ని పట్టుకుని ఆ సారా ఎవరు అమ్మేరో?ఎక్కడ తయారు చేస్తున్నారో ? కనుక్కుని ఎక్సయిజ్ అధికారులు శిక్షిస్తున్నారు. దొంగ సొత్తు దొరికితే ఆసొత్తు ఎక్కడినుండి దోచుకుని, ఎవరికి అమ్మేరో? కనుక్కుని వారందరిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. కానీ ఇక్కడ మైనింగ్ అధికారులు పర్మిట్స్ లేకుండా సరుకు అమ్మేవార్ని వదలిపెట్టి, రవాణా చేసే లారీ యజమానులను బలిపశువులు చేస్తున్నారు. క్వారీలు,క్రషర్లు కు అనుమతులు ఇచ్చేది మైనింగ్ అధికారులే. ఎవరికి అనుమతులున్నాయి. ఎవరికి లైసెన్సులు లేవో వారికి తెలుసు. మైనింగ్ అనుమతులు పర్మిట్స్ లేకుండా బహిరంగంగా వ్యాపారం చేస్తున్నా పట్టించుకోకుండా, క్వారీలు,క్రషర్లు యజమానులను జలగలు లా పిండి లక్షలాది రూపాయలు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేస్తున్న మైనింగ్ అధికారులకు లారీ యజమానులపై కేసులు పెట్టె నైతిక హక్కు లేదు. క్వారీలు ఎవరు త్రవ్విస్తున్నారో ఎంత మట్టి,సట్టు, రాయి త్రవ్వి తీస్తున్నారో క్వారీ గోతులు కొలిస్తే తెలుస్తుంది. ఎంత మెటలు క్రషింగ్ చేసారో? క్రషర్లు కరెంట్ బిల్లులు చూస్తే తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ వ్యాపారంపై మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయలు లంచాలు రూపంలో వసూలు చేస్తున్నారు కనుక. ప్రజా ధనం తో జీతాలు తీసుకుంటూ, లంచాలు పోగేసుకుంటానికి మాత్రమే వీరు పనిచేస్తున్నారు. ఇటీవల క్రషర్ యజమాని నుండి రూ.60,000/- వసూలు చేసి, రూ.30000/- కు రసీదు ఇచ్చారని ప్రెస్సులో వస్తే దానిపై విచారణ లేదు. చర్యలు లేవు. క్రింద నుండి పై అధికారుల వరకు లంచాలలో వాటాలు తీసుకుంటున్నారు కనుక. ఇప్పుడు అదే అవినీతికి పాల్పడిన అధికారి కక్ష కట్టి క్వారీ బాటల్లో దారి కాసి, లారీ లకు కేసులు వ్రాస్తున్నారు. వీరికి భయం,భక్తి లేదు.రాదు. వీరికి లంచాలు ఇవ్వలేక,అనునిత్యం దొంగల్లా బ్రతకలేక నిజాయితీగా పర్మిట్లు తీసుకుని రాయల్ గా వ్యాపారం చేద్దామన్న క్వారీ,క్రషర్ యజమానులకు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల పెర్మిట్లు,పర్మిషన్స్ రావటంలేదు. బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న మైనింగ్ అధికారులను నిలదీయాల్సిన సమయం వచ్చింది. మన ఓట్లతో నెగ్గి అధికారం అనుభవిస్తున్న మన మినిస్టర్ గార్కి లారీ యజమానులంతా కలిసి వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి. జిల్లా కలెక్టర్ గారి వద్దకు వెళ్లి, లంచగొందులయిన మైనింగ్ అధికారుల భాగోతం వివరించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరాలి. అప్పుడే దీనికి పరిష్కారం లభిస్తుంది... ఆఖరిగా చిన్న "ట్విస్ట్". ... వసూలు అయిన సీనరేజ్ ఆదాయం లో గ్రామపంచాయతికి 25%; మండల పరిషత్ కి 50%; జిల్లా పరిషత్ కి 25% చెందుతుంది. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా రాదు. కానీ వసూలు చేసేది మైనింగ్ డిపార్టుమెంట్. నష్టపోయేది పంచాయతీలు,మండల,జిల్లా పరిషత్ లు. అంటే గ్రామీణ ప్రజలు.అంటే మనమే.మన పంగిడి, దేచర్ల గ్రామాల క్వారీ ల నుండి ఉత్పత్తి కాబడే సట్టు,మట్టి,నల్లరాయి లపై ప్రతి ఏటా సుమారు 6 కోట్లు సీనరేజ్ వస్తుంది. అందులో మన పంచాయతీకి ఒకటిన్నర కోట్లు, మండలానికి మూడు కోట్లు, జిల్లా పరిషత్ కు ఒకటిన్నర కోట్లు ఆదాయం వస్తుంది. కనుక మన పంచాయతీలో అధికారంలో గల వై.యస్.ఆర్. పార్టీ పాలకవర్గం లారీ యజమానులు పోరాటానికి ముందుండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను...నిత్యం ప్రజా సంక్షేమం కోరుకునే... మీ పి.కె.రంగారావు.