22/05/2026
రెండున్నర గంటల్లో హైదరాబాద్.. రెండు గంటల్లో విజయవాడ
• పల్నాడు ప్రజలకు 'ఇంటర్‌సిటీ' ప్రయాణం.. ఇక సురక్షితం, సుఖమయం!
• రైల్వే శాఖను ఒప్పించి పల్నాడు వాసుల కష్టాలు తీర్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు
పల్నాడు ప్రాంత ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థుల దశాబ్దాల నాటి రవాణా కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. లింగంపల్లి - విజయవాడ మధ్య నడిచే ప్రతిష్టాత్మక *ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ఎంప్లాయీస్ ట్రైన్: 12795/12796)* రైలుకు పిడుగురాళ్ల స్టేషన్‌లో స్టాపేజ్ మంజూరు చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. కేవలం రెండున్నర గంటల్లో హైదరాబాద్, గంటన్నర నుండి రెండు గంటల్లో గుంటూరు, విజయవాడ నగరాలకు చేరుకునేలా సాగబోయే ఈ ప్రయాణం పల్నాడు ప్రజలకు మరింత మెరుగైన, లాభదాయకమైన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
కళ్లముందే రైలు… కానీ ఎక్కలేని పరిస్థితి!
విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అనేది ఈ రూట్‌లో అత్యంత వేగంగా వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు. అయితే, గతంలో ఈ రైలుకు ఉన్న స్టాపేజీల వివరాలు చూస్తే పల్నాడు ప్రజల దుస్థితి అర్థమవుతుంది. ఈ రైలు విజయవాడ జంక్షన్, మంగళగిరి, గుంటూరు జంక్షన్ లలో ఆగిన తర్వాత నేరుగా నల్గొండలోనే ఆగాలి. మధ్యలో గుంటూరు, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అత్యంత కీలకమైన, వ్యాపార పరంగా పెద్ద కేంద్రమైన పిడుగురాళ్లను దాటుకుంటూ ఈ రైలు వెళ్లిపోయేది.
పల్నాడు నడిబొడ్డున ఉన్న పిడుగురాళ్ల మీదుగా రైలు కూతపెట్టుకుంటూ పోతుంటే.. స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మాత్రం ఆ రైలును చూస్తూ నిట్టూర్చడం తప్ప ఎక్కే అవకాశం ఉండేది కాదు. ముఖ్యంగా హైదరాబాద్ మరియు విజయవాడ నగరాలకు నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రధాన సమయాల్లో రైలు ప్రయాణం అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ ఇబ్బంది పడేవారు.
రైలు లేక ప్రజల పడిన కష్టాలు
పిడుగురాళ్ల చుట్టుపక్కల ప్రజలు హైదరాబాద్ లేదా విజయవాడ వెళ్లాలంటే ముందుగా గుంటూరు లేదా నల్గొండ వరకు బస్సుల్లో వెళ్లి అక్కడి నుంచి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల సమయం వృథా, అదనపు ఖర్చు, ప్రయాణ అలసట.
రాత్రి వేళల్లో భద్రత సమస్యలు.. మహిళలు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు. ఇవికాక ప్రైవేట్ బస్సుల అధిక చార్జీలు ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేవి. పండుగల సమయంలో అయితే టికెట్ ధరలు అమాంతం పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పడేది.
ప్రజల సమస్యను సవాల్‌గా తీసుకున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు..
పల్నాడు ప్రాంత ప్రజల ఈ దశాబ్దాల వేదన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి దృష్టికి వచ్చింది. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించే ఆయన, దీనిని ఒక సవాల్‌గా తీసుకున్నారు. రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో పాటు, కేంద్ర రైల్వే మంత్రితో స్వయంగా నిరంతరం చర్చలు జరిపారు. పిడుగురాళ్లలో స్టాపేజ్ ఇవ్వడం వల్ల పల్నాడు ప్రాంత వాసులకు జరిగే మేలును, అక్కడ రవాణా అవసరాలను రైల్వే మంత్రికి బలంగా వివరించారు.
త్వరలోనే రైలు హాల్ట్!
పల్నాడు ప్రజల పక్షాన ఎంపీ గారు చేసిన నిరంతర పోరాటం, శ్రమ చివరకు ఫలించాయి. ఎట్టకేలకు రైల్వే శాఖ నుంచి పిడుగురాళ్ల స్టాపేజ్ కోసం ఆమోద ముద్ర లభించింది. ఆయన అలుపెరగని కృషి ఫలితంగా త్వరలోనే విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో ఆగనుంది.
ఇకపై సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీ!
ఇకపై ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ పిడుగురాళ్లలో ఆగనుండటంతో ప్రయాణికుల కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోనున్నాయి.
*రెండున్నర గంటల్లోనే హైదరాబాద్:* పిడుగురాళ్ల నుండి హైదరాబాద్ (సికింద్రాబాద్/లింగంపల్లి) వైపు వెళ్లే ప్రయాణికులు కేవలం 2 గంటల 30 నిమిషాల్లోనే సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
*రెండు గంటల్లోనే విజయవాడ:* అటు గుంటూరు, విజయవాడ వైపు వెళ్లేవారు కేవలం 1:30 నుండి 2 గంటల లోపే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
*సురక్షితమైన ప్రయాణం:* ఇకపై ప్రైవేట్ వాహనాల్లో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించే రోజులు త్వరలోనే చరిత్రలో కలిసి పోనున్నాయి. సూపర్ ఫాస్ట్ రైలులో ఎంతో లగ్జరీగా, సురక్షితంగా ఏ విధమైన అలసట లేకుండా ప్రయాణించవచ్చు. ఉద్యోగులు ఉదయాన్నే వెళ్లి, రాత్రికి క్షేమంగా ఇళ్లకు చేరుకునే అద్భుతమైన అవకాశం లభించింది.
రైలు సమయాలు(అంచనా)
• ట్రైన్ నెం. 12796 (లింగంపల్లి ➔ విజయవాడ): ప్రతిరోజూ ఉదయం 4:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించి.. ఉదయం 8:09(అంచనా) గంటలకు పిడుగురాళ్ల స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది.
• ట్రైన్ నెం. 12795 (విజయవాడ ➔ లింగంపల్లి): ప్రతిరోజూ సాయంత్రం 05:30 గంటలకు విజయవాడలో బయలుదేరి.. రాత్రి 07:04(అంచనా) గంటలకు పిడుగురాళ్ల స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి రాత్రి 11:35 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
త్వరలోనే ఈ స్టాపేజ్ అధికారికంగా అమలులోకి వచ్చే తేదీని రైల్వే శాఖ ప్రకటించనుంది. ఈ సువర్ణ అవకాశాన్ని పల్నాడు జిల్లా ప్రయాణీకులు, ఉద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గౌరవ ఎంపీ గారు కోరారు.
*ప్రజల అవసరాలే మా ప్రాధాన్యం*
- ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.