04/05/2024
కాకినాడకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటూ, తీరప్రాంతాన్ని యే ఉప్పెనలూ ముంచెత్తకుండా అడ్డుగోడగా నిలుస్తున్న మడఅడవుల (మాంగ్రూవ్స్) గురించి ఓ నాలుగు ముక్కలు..
చదువుకునే పిల్లలకి ప్రకృతి గొప్పదనాన్ని, బయోడైవర్సిటీ (జీవవైవిధ్యం) గురించి వివరించాలనుకుంటే ఉదాహరణలతో సహా ప్రత్యక్షంగా చూపించగలిగే మంచిచోటిది..
అతిపెద్ద మడఅడవుల్లా చెప్పే పశ్చిమబెంగాల్ సుందరవనాల తర్వాత మన కోరంగి మడఅడవులే పెద్దవంటారు.. ఐక్యరాజ్యసమితి లెక్కలప్రకారం అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జీవవైవిధ్యం ఉన్న మడఅడవి కూడా ఇదే..
పిల్లకాలువలుగా మారిన నదులు ఎక్కడెక్కడైతే సముద్రంలో కలుస్తాయో సరిగ్గా అక్కడే ఏర్పడతాయి ఈ మడఅడవులు.. వలెయ్యడానికి, వేటాడ్డానికి అనువుగాని చిత్తడిప్రాంతం గనుక కొన్ని రకాల కొంగజాతుల సంతానోత్పత్తికి, ఆహారానికి బాగా అనుకూలం ఈ ప్రాంతం.
ఇలా అందాలకి, అనుభవాలకి, అరుదైన జీవరాశులకి ఆవాసంగా వెలుగొందుతోన్న ఈ అభయారణ్యంలోపలికెళ్లడానికి
పిల్లలకు 20, పెద్దలకు 50 టికెట్టు ధరలు పెట్టారు..
ఒకప్పుడయితే కోరంగిలో పక్కనే కైట్స్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీపిల్లలు మాత్రమే వచ్చి వాళ్ళ ప్రైవసీ పనుల్లో వాళ్ళుండేవారు.. కానీ ఈ మధ్య సాధారణ సందర్శకులు కూడా బాగా పెరిగారు..
ప్రతీరోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శకులను అనుమతించే ఈ అడవికి ప్రతి మంగళవారం, తుపాన్లొచ్చినప్పుడూ మాత్రం సెలవు... !!
లోపలికెళ్తుండగానే కోరంగి నేచర్ షాపు, క్యాంటీన్లు, అడవి లోపలికంటా మూడు కిలోమీటర్ల మేర చెక్కబ్రిడ్జీలు బాగా మోపు జేశారు ఎక్కడికక్కడ.. చిన్నపిల్లలాడుకోవడానికి ఉయ్యాల బల్లలున్నాయి, సేదతీరడానికి చెక్కబల్లలేశారు.. బాగున్నాయి.. !!
ఇక సన్నని మెట్లెక్కి పైనుంచి అడవంతా చూడ్డానికి వాచ్ టవర్ కూడా కట్టారు.. ఆయాసపడుతూ పైకెక్కి చూస్తే ప్రతీ వైపు పచ్చదనమే.. !!👌
మడఅడవులంటే మామూలు అడవుల చెట్లవేరుల్లా భూమిలోపలకి కాకుండా నీటిలోంచి పైకి తేలుతున్నట్టుంటాయ్ ఈ మడచెట్లు.. ఆ వేర్లలోంచి ఇంకో కొత్తవేర్లు వాటిలోంచి మళ్లీ చెట్లు.. ఇలా అల్లుకుపోయి ఉండటంతో గుబురుగుబురుగా ఉంటాయివి..
ఇందులో పొన్న (దీన్నే తెల్లమడ అంటారనుకుంటా బైపీసీ బోటనీ ప్రకారం), నల్లమడ, గుండు, కళింగ, గుగ్గిలం లాంటి మడజాతి మొక్కలతో ఎన్నో రకాల చేపలు, సముద్రపు తాబేలు, నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లంపిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు, ఉభయచరాలు, పక్షులు, రకరకాల జీవజాలాలుంటాయ్.. బహుశా జనాలెక్కువగా తిరుగుతుండటం వల్ల కావొచ్చు.. బోర్డుల్లో చూపించిన చేపలు పట్టే పిల్లి, పైన చెప్పిన జంతువులేవీ బయటకి కనబళ్ళేదు.. లోపలకి ఉండొచ్చేమో.. ఇదేం చిన్నది కాదు కదా.. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న మడఅడవుల్లో 65శాతం కోరంగిలోనే ఉంది మరి...
ఈ విశేషాలన్నీ చూస్కుంటూ అలా నదీపాయ దగ్గరికెళ్తే అందులో అటవీశాఖ వారు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటు షికారు కూడా చెయ్యొచ్చు.
18 వ శతాబ్దంలో ఏకైక పోర్టుగా వెలుగొంది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కోరంగి పోర్టు తాలూకూ లైట్ హౌస్ కూడా చూసి రావొచ్చు..
ఇంతటి జీవవైవిధ్యాన్ని, ఆవాసాన్ని, ఆనందాన్ని, ఆక్సిజన్ని అందిస్తున్న మడఅడవులు మౌనంగా చేస్తున్న ఇంకో గొప్ప పనుంది.. అదే చుట్టుపక్కల ప్రాంతాల్ని తుఫాన్లనించి కాపాడ్డం..
అవును.. సుడివేగంతో దూసుకొచ్చే పెనుగాలుల్ని చిరుకొమ్మల్తో ఆపుతాయి.. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రపు కెరటాల్ని చిగురుటాకుల్తో అడ్డుకుంటాయి.. అవేవీ బయటి ప్రపంచానికి తెలీనివ్వకుండా ఎప్పట్లానే చిన్నగా కనబడతాయి.. !!
1996లోనూ, పెథాయ్ నించీ కాకినాడ తెర ప్రాంతానికి అనేక తుఫాన్లొచ్చినప్పుడు కూడా కాకినాడ, యానాం, భైరవపాలెం, తాళ్లరేవు, చొల్లంగి, కోరంగి లాంటి సముద్ర తీరప్రాంత ప్రజలు గుండెలమీద చెయ్యేసుకుని నిద్రపోగల్గుతున్నారంటే కారణం భీభత్సానికి అడ్డుగోడగా నిలుస్తున్న ఈ మడఅడవుల వల్లే..
ఎంతైనా అడవులనేవి కంటికి కనిపించని ధర్మం లాంటివి.. వాటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయ్..
Post credit : -హరిబాబు మద్దుకూరి