24/05/2017
హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళి అర్పించి, రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, జూన్ 3న కేసీఆర్ కిట్స్ పంపిణీ, జూన్ 4న ఒంటరి మహిళలకు భృతి కార్యక్రమాలుంటాయి. ఈ మూడు కార్యక్రమాలను మండలం యూనిట్ గా నిర్వహించాలని, దీనికోసం ప్రతీ మండలంలో ఓ ప్రముఖుడు పాల్గొనేలా కార్యక్రమం రూపొందించాలని సీఎం అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ లు పతాకావిష్కరణ చేస్తారని వెల్లడించారు. మండలాల్లో ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటిసిలు, ఎంపిపిలు ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని సీఎం కోరారు. దీనికి సంబంధించి కలెక్టర్లు కార్యక్రమం రూపొందించాలని అన్నారు. జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు లేని చోట తాత్కాలిక స్థూపాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించాలని, శాశ్వత అమరవీరుల స్థూపాలు నిర్మించాలని చెప్పారు. హైదరాబాద్ లో తానే స్వయంగా గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తానని సీఎం వెల్లడించారు. రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా గ్రామం నుంచి ఢిల్లీ వరకు అన్ని చోట్లా ప్రత్యేక పండుగ వాతావరణం ఉండేలా చూడాలన్నారు. హైదరాబాద్ నగరంలోనూ, జిల్లా కేంద్రంలోనూ ప్రతీ ముఖ్య కూడలిని అలంకరించాలని కోరారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా రాష్ట్రావతరణ వేడుకల వాతావరణం కనిపించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలని చెప్పారు.
రాష్ట్రావతరణ దినోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ప్రగతి భవన్లో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీ టి. హరీష్ రావు, ఎంపి శ్రీమతి కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్, జెన్ కో –ట్రాన్స్ కో సిఎండి శ్రీ డి. ప్రభాకర్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి శ్రీ రఘుమారెడ్డి, జిహెచ్ఎంసి కమీషనర్ శ్రీ బి. జనార్థన్ రెడ్డి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్, జల వనరుల నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వి. ప్రకాశ్, ఎమ్మెల్యే శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.