05/09/2026
పొలీస్ మరియు ప్రజల బాగస్వామ్యం తో కలసి ఈ రోజు సంఘమిత్ర కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఘనంగా ప్రారంభం.
ఈ రోజు సంఘమిత్ర కార్యక్రమం లో భాగంగా మొదటగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయం సహాయ గ్రూపులకు చెందిన మహిళా సంఘాలలు ) గ్రామ దీపికలు (VOA), మెప్మా భాగస్వామ్యంతో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలీసు శాఖ మరియు ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.
వరంగల్ లో“సంఘమిత్ర” కార్యక్రమం ద్వారా డ్రగ్స్ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాము. SHG, VOA సంఘాల్లోని ప్రతి సభ్యురాలు ఈ కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతి అంశంపై అవగాహన సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పోలీసులు–ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, వరంగల్ జిల్లాను మరింత సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో సంఘమిత్ర ఒక బలమైన వారధిగా నిలవాలి.
SHG, వాలంటీర్స్, మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, మహిళలు మరియు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు “సంఘమిత్ర” కార్యక్రమాన్ని శనివారం హన్మకొండ లోని కాళోజి కళా క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. SHG గ్రూపులు 1,000 మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ, వారి ద్వారా జిల్లాలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
“జనగామ జిల్లాలో మొదటిసారిగా ‘సంఘమిత్ర’ కార్యక్రమం నిర్వహించండింది. నేడు వరంగల్ జిల్లాలో నిర్వహించడంతో పాటు మరికొద్ది రోజుల్లో హన్మకొండ జిల్లాలో సైతం మత్తు పదార్థాలు వ్యతిరేకంగా విస్తృతంగా సంఘ మిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. SHG, వాలంటీర్స్, మెప్మా గ్రూపు సభ్యులు తలచుకుంటే గంజాయి నిర్మూలన సాధ్యమవుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించడంలో మహిళా సంఘాల సభ్యులు కీలక పాత్ర పోషించాలి.ప్రతి తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి, తన బిడ్డ డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా చూడాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడాలి. ప్రతి తల్లి బాధ్యత తీసుకుంటే గంజాయి, డ్రగ్స్ నిర్మూలన తప్పకుండా సాధ్యమవుతుంది.డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలి. ఎలాంటి భయం లేకుండా సమాచారాన్ని పోలీసులకు అందించండి. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. విలువైన సమాచారం అందించిన వారికి తగిన రివార్డు కూడా అందజేస్తాం.ప్రతి గ్రామ సమైక్య సభ్యురాలు ఒక *‘సంఘమిత్ర’*గా పనిచేసి, తన పరిధిలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని చేరవేయాలి. మీ ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు, వారి ద్వారా ప్రతి కుటుంబానికి ఈ సందేశం చేరాలి.డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని దూరం చేయకుండా, వారికి కౌన్సెలింగ్, వైద్య సహాయం మరియు కుటుంబ సహకారం అందేలా చూడాలి. సరైన సమయంలో సహాయం అందిస్తే వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చు.
మన యువతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలి. డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాన్ని చేరవేయాలనే ఉద్దేశంతోనే ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములై పోలీస్ శాఖకు సహకరించాలి”.
వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఐఏఎస్ మాట్లాడుతూ:
“డ్రగ్స్ సమస్య కేవలం పోలీస్ శాఖకు సంబంధించిన అంశం కాదు. ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. అందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలి.యువతను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యాసంస్థలు మరియు గ్రామ సమైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలి.ప్రతి కుటుంబంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ:
“సంఘమిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి SHG సభ్యుడు తన గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ ఒక సైనికుడిగా పనిచేయాలి.ప్రతి కుటుంబంతో మాట్లాడి డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే ప్రమాదాలను వివరించాలి. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారికి సరైన మార్గదర్శనం చేయాలి.డ్రగ్స్ విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ప్రజల సహకారంతో డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు”
డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడిన వ్యక్తి సందేశం:
కార్యక్రమంలో గతంలో డ్రగ్స్‌కు బానిసై, అనంతరం వాటిని పూర్తిగా వదిలి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చిన వ్యక్తి తన అనుభవాలను పంచుకున్నారు.“డ్రగ్స్ నాకు కొన్ని గంటల మత్తును ఇచ్చాయి… కానీ నా కుటుంబానికి ఎన్నో రోజుల కన్నీళ్లను ఇచ్చాయి. ఏ యువకుడూ నా పరిస్థితికి రావద్దు. డ్రగ్స్‌ను ఒక్కసారి కూడా ప్రయత్నించవద్దు”
డ్రగ్స్ అవేర్‌నెస్ స్కిట్:
డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థినులు ప్రత్యేకంగా డ్రగ్స్ అవేర్‌నెస్ స్కిట్ ప్రదర్శించారు. యువత, కుటుంబాలు డ్రగ్స్ కారణంగా ఎదుర్కొనే సమస్యలను ప్రదర్శన ద్వారా వివరించారు.
ప్రత్యేక వీడియోల ద్వారా అవగాహన:
కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగాల వీడియోలు, గౌరవ DGP గారి సందేశాల వీడియోలు, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (TG NAB) డైరెక్టర్ గారి అవగాహన వీడియోలు మరియు ఇతర ప్రముఖుల డ్రగ్స్ వ్యతిరేక సందేశాల వీడియోలను ప్రదర్శించారు.వీటి ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం మరియు డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరి బాధ్యతపై అవగాహన కలిపించాము.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అడిషనల్ కలెక్టర్ వై. వి. గణేష్, ఐ.ఏ.ఎస్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పిడి డిఆర్డీఓ నాగ పద్మజ, జిల్లా వైద్యాధికారి రాజిరెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ భరత్, జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు శ్రీమతి రజిత, టిఎల్ ఎఫ్ అధ్యక్షురాలు పద్మ తో పాటు వెయ్యి కి పై వివిధ మహిళ సంఘాల సభ్యులు SIలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
“ప్రతి తల్లి చైతన్యవంతమైతే – ప్రతి కుటుంబం సురక్షితం.”
“ప్రతి కుటుంబం చైతన్యవంతమైతే – డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమే.”
అనే సందేశంతో సంఘమిత్ర కార్యక్రమాన్ని వరంగల్ లో ఘనంగా ప్రారంభించాము.
ఎన్. శ్వేత, ఐపిఎస్
వరంగల్ పోలీస్ కమిషనర్