22/06/2025
పాతిక సంవత్సరాలు...
ఒక హాస్పిటల్ పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎందుకు అంత buzz అని అడగొచ్చు. కానీ, అది ఒక హాస్పిటల్ కాదు, తెలుగు నేల మీద ఏ కుటుంబం కూడా, తన లానే కుటుంబ పెద్దని దూరం చూసుకునే దురదృష్టం రాకూడదు అని ఒక మహానుభావుడు మొదలుపెట్టిన మహా యజ్ఞం అది.
1985 నందమూరి బసవ తారకం గారు క్యాన్సర్ తో దూరం అయిన తరువాత, ఇంటి పెద్దగా ఆవిడ లేని లోటు చూసి తెలుగు నాట ఎవరికి అలాంటి ఇబ్బందులు రాకూడదు అని, ఎన్టీఆర్ తలపించారు. అందుకే తరువాత సంవత్సరమే ఆవిడ పేరు మీద క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక సంస్థ పెట్టీ, దాని అధ్వర్యంలో ఒక హాస్పిటల్ పెట్టాలని, అందులో వ్యక్తికి వచ్చిన క్యాన్సర్ ను చూడాలి తప్ప, అతని అంతస్తులు కాదని, ఏ పేద తెలుగింటి లోగిలి కూడా తన మాదిరి కుటుంబంలో ముఖ్యమైన వారిని కోల్పోయే అవకాశం రాకూడదని, అనాటికి తక్కువ మంది క్యాన్సర్ ను ట్రీట్ చేసే డాక్టర్లే ఉన్నా సరే, అమెరికాకి వెళ్ళి అక్కడి తెలుగు వారిని కదిలించి, అక్కడ సెటిల్ అయిన డాక్టర్లను ఇండియా రావడానికి ఒప్పించి హాస్పిటల్ కి అంకురార్పణ చేశారు.
అప్పటి నుంచీ మొదలు పెడితే 2000 నాటికి హాస్పిటల్ నిర్మాణం పూర్తయి, నాటి ప్రధానమంత్రి వాజపేయి చేతుల మీదగా హాస్పిటల్ ప్రారంభం అయింది. ఆనాటికి క్యాన్సర్ వస్తే ఆశలు వదిలేసుకునే పరిస్థితి నుంచీ, నేటికి "క్యాన్సరా? బసవతారకం హాస్పిటల్ ఉంది, అంతా బాలయ్య చూసుకుంటాడు, మరేం పర్లేదు" అనే స్థాయికి తెలుగు ప్రజలలో ఒక భావన తీసుకుని వచ్చిన క్రెడిట్ మాత్రం ఈ హాస్పిటల్ దే.
అలా అని కేవలం హాస్పిటల్ పెట్టీ చికిత్స మాత్రమే కాదు, క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమాలు, తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ టెస్టులు, పేద వారి కోసం అతి తక్కువ ఖర్చు లేదంటే అసలు ఖర్చు లేకుండా వైద్యం చేయడం ఇలా ఒక రకంగా క్యాన్సర్ మీద ఆ ఫౌండేషన్ ఒక యుద్ధమే చేసింది.
అందుకే గత 4 సంవత్సరాలుగా టాప్ హాస్పిటల్ గా అవార్డులు తెచ్చుకుంటుంది. తెలుగు రాష్ట్రాలే కాదు జాతీయ స్థాయిలో ఆ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద చేసిన కృషి అనిర్వచనియం.
చిన్న ఉదాహరణ చెప్తే ఆ హాస్పిటల్ గొప్పదనం అర్ధం అవుతుంది. అది 2011 రోజులు, కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం ప్రభ వెలుగుతున్న రోజులు, అప్పట్లో సోనియా గాంధీకి ఎదురు లేదు, అప్పటికి ప్రపంచంలో శక్తివంతమైన మహిళలలో మొదటి 5 మందిలో సోనియా గాంధీ ఒకరు. ఆవిడకి క్యాన్సర్ వ్యాధి వచ్చి, సర్జరీ చేయాలి, దేశంలో ఆవిడ మాటకి ఎదురు లేదు, ప్రపంచ దేశాలు కూడా సోనియా కోసం ఎదురుచూస్తున్న టైంలో ఆవిడ సర్జరీ చేసింది ఈ హాస్పిటల్ మనిషి(నోరి దత్తాత్రేయ గారు, హాస్పిటల్ ట్రస్టీ). అది ఈ హాస్పిటల్ గొప్పదనం.
NBTR హాస్పిటల్ ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం చాలా మంది దాతలు, అక్కడి డాక్టర్లు, సిబ్బంది అంతా. కానీ మూల స్తంభాలుగా చెప్పుకోవాల్సింది మాత్రం
మొదటిగా ఫౌండేషన్ స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు క్యాన్సర్ కారణంగా కుటుంబాన్ని పోగొట్టుకుని బాధ పడకూడదు అనుకున్న స్వర్గీయ ఎన్టీఆర్ గారు,
తరువాత అప్పటికి అమెరికాలో లీడింగ్ సర్జన్ గా ఉండి, తెలుగు ప్రజలకి చౌకగా వైద్యం అందాలని కోరుకున్న డాక్టర్. తులసి పోలవరపు గారి కుటుంబం( ఫౌండేషన్ కోసం వైద్యులను ఏకం చేయడం, నిధుల సేకరణ చేయడం లాంటివి చేసి హాస్పిటల్ స్కెలిటన్ లో ముఖ్య పాత్ర ఆవిడది)
స్వతహాగా డాక్టర్ అయి, పేద ప్రజలకు చౌక వైద్యం అందడం, దాని ప్రాముఖ్యత తెలిసి హాస్పిటల్ అడుగులు వేస్తున్న సమయం నుంచి హాస్పిటల్ ను తన సొంత మనిషిలా చూసుకునీ, ఈ రోజున హాస్పిటల్ ఇలా ఉండడానికి మరో మూల కారణం అయిన ఒకప్పటి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, అమెరికాలో మంచి పొజిషన్లో ఉండి కూడా ఈ హాస్పిటల్ కోసం వచ్చిన నోరి దత్తాత్రేయ గారు
ఇక కోడెల గారి నుంచీ బాలయ్య కి ట్రాస్ఫర్ జరిగే క్రమంలో మధ్యలో హాస్పిటల్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాని మధ్యలో ఎక్కడా ఇబ్బందులు పడకుండా చూసుకున్న కాకర్ల సుబ్బారావు గారు
గత పదేళ్లుగా తన తండ్రి గారు మొదలుపెట్టిన పనిని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్న నందమూరి బాలకృష్ణ గారు.
ఇటీవల కొత్త కొత్త హాస్పిటల్స్ వస్తున్నా సరే, ఇక ముందు కూడా ఈ హాస్పిటల్ తెలుగు నాట క్యాన్సర్ చికిత్స విషయంలో ధ్రువతారగా ఉండాలని, హాస్పిటల్ కానీ, ఆ ఫౌండేషన్ కానీ వ్యవస్థాపక మూల కారణాన్ని మరచిపోకుండా ముందుకు వెళ్లాలని, సిల్వర్ జూబ్లీ వేడుకలు కాదు, ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవాలని ,
చివరగా కుల, మత , ప్రాంత, రాజకీయ, సినీ వైషమ్యాలతో అన్యాపదేశంగా తనని ద్వేషించినా సరే వారి ఒంట్లో కేన్సర్ ను తన మన చూడకుండా నిర్మూలించిన, నిర్ములిస్తున్న, నిర్ములించబోయే బంగారు బాలయ్యకి మరింత శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
-
టీమ్ రాడికల్స్