20/08/2026
ఆస్ట్రేలియన్ మహిళ భారతీయుడితో ప్రేమలో పడి వివాహం.. కూతురు కూడా పుట్టింది.. కానీ వీసా సమస్యతో ఇబ్బంది
ఆస్ట్రేలియా, ఆగస్టు 19:
ఒక సాధారణ భారత పర్యటన జీవితాన్ని మార్చేసిన కథ ఇది. ఆస్ట్రేలియాకు చెందిన లోరెనా స్టెఫనీ 2024 జనవరిలో తమిళనాడులోని మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే రబీక్ బహుర్దీన్ అనే యువకుడు ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు డ్రైవర్‌గా వచ్చాడు. ఆ రైడ్‌తోనే ప్రారంభమైన పరిచయం క్రమంగా స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది.
రబీక్ తన స్వస్థలాన్ని చూపిస్తూ లోరెనాతో సమయం గడిపాడు. కానీ ఇరు కుటుంబాలు ఈ సంబంధాన్ని సులభంగా అంగీకరించలేదు. కష్టాలు పెరిగిన తర్వాత వారు కలిసి ఒక నెలపాటు ప్రయాణాలు చేసి దూరంగా ఉండి సమయం గడిపారు. కలిసిన ఏడాది తర్వాత 2025 జనవరి 23న వారు వివాహం చేసుకున్నారు.
వివాహం అయినా వీసా, ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా వారు వేర్వేరు దేశాల్లోనే ఉండాల్సి వచ్చింది. దీర్ఘకాలిక దూర సంబంధం కొనసాగుతూనే 2026 ఫిబ్రవరిలో వారికి మొదటి సంతానం – కూతురు మర్యం జన్మించింది. రబీక్‌కు ఆస్ట్రేలియా వీసా రాకపోవడంతో అతను కూతురు పుట్టిన సమయంలో హాజరు కాలేకపోయాడు. కూతురికి పాస్‌పోర్ట్ వచ్చిన తర్వాతే అతను ఆమెను చూడగలిగాడు.
ప్రస్తుతం కూడా వారు ఒకే ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నారు. రబీక్ ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే పార్టనర్ వీసా అవసరం. దీని ఖర్చు సుమారు 11,700 ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ.7.9 లక్షలు), అదనంగా లాయర్ ఫీజు సుమారు 9,700 డాలర్లు (రూ.6.5 లక్షలు) ఉంటుంది.
లోరెనా భారత్‌లో ఎక్కువ కాలం గడుపుతున్నా శాశ్వతంగా మారకపోవడానికి కారణం చెబుతూ.. “నా తల్లిదండ్రులు, కుటుంబం ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. అక్కడ టీచింగ్‌లో పర్మనెంట్ ఉద్యోగం సాధించేందుకు చాలా కష్టపడ్డాను. అది వదిలేయడం సులభం కాదు. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను. ఎక్కువ సమయం భారత్‌లోనే గడుపుతున్నాను. ఇక్కడ చాలా ఇష్టం” అని చెప్పారు.
ప్రేమ కథ ఇలా సాగుతున్నా.. వీసా అడ్డంకి వారిని ఇంకా వేరుచేస్తోంది.