27/11/2022
మాక్లూర్ మండల కేంద్రంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ
బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాక్లూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిపేట్ పలుగుట్ట శ్రీశ్రీశ్రీ మంగి రాములు మహరాజ్ గారు, ఛత్రపతి శివాజీ సేన సంస్థ జిల్లా అధ్యక్షులు ఎం. లక్ష్మణ రావు గారు, మాక్లూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్ గారు, ప్రధాన వక్త విజయ్ భాస్కర్ గారు, నారాయణ మహరాజ్ గారు, మాక్లూర్ మండల బీజేపీ అధ్యక్షులు కాళ్లగడ్డ వినోద్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహదాత ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ శివాజీ మహరాజ్ గారి చరిత్ర స్ఫూర్తిదాయకమని, పిల్లలకు తల్లులు బాల్యం నుండే శివాజీ మహరాజ్ ఆశయాలను బోధించాలని ఆయన స్పూర్తితో చెడు వ్యసనాలకు యువత బానిసలుగా మారకుండా ధర్మ రక్షణ కొరకు పాటు పడాలని అందుకొరకే ప్రతి గ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు కంకణం కట్టుకున్నానని వెల్లడించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని శివాజీ విగ్రహం లేని ఏ గ్రామం నుండైన యువత విగ్రహ ఏర్పాటుకు ముందుకు వస్తే తన వంతు సాయంగా విగ్రహం అందిస్తానని తెలిపారు. మాక్లూర్ మండల కేంద్రంలో శివాజీ ఏర్పాటుకు గత ఏడాదిగా కృషి చేస్తున్న శివాజీ సేన సభ్యులను మరియు ముఖ్యంగా మైనారిటీ సోదరులు సైతం శివాజీ స్పూర్తితో మత సామరస్యం విరాజిల్లేలా విగ్రహ ఏర్పాటు కు కృషి చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అర్మూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు, మాక్లూర్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు,యువకులు, గ్రామస్తులు పెద్దయెత్తున్న పాల్గొన్నారు.