04/06/2026
APCRDA ఆధ్వర్యంలో "డిస్ట్రిక్ట్ కూలింగ్" విధానంపై సాంకేతిక అవగాహన సదస్సు
ప్రజారాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి, సుస్థిరమైన రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపీఏ) అమరావతి చాప్టర్, ISHRAE విజయవాడ చాప్టర్‌ల సహకారంతో "అమరావతికి డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ" అంశంపై రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో గురువారం 2026 జూన్ 4వ తేదీన సాంకేతిక అవగాహన సదస్సును నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో APCRDA, ADCL, AGICL, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు సహా 150 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. సదస్సులో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ మాట్లాడుతూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిలో కేంద్రికృత యుటిలిటీ వ్యవస్థలు, భవనాలలో ఆధునిక సేవలు, సమర్థవంతమైన మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుగానే రూపొందించడం ఎంతో అవసరమన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం, నాణ్యమైన అమలు, సమర్థ నిర్వహణ ద్వారా మాత్రమే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.
ఐపీఏ అమరావతి చాప్టర్ కార్యదర్శి కిరణ్ పరుచూరి మాట్లాడుతూ, అమరావతి నిర్మాణంలో పాల్గొంటున్న ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఐపీఏ అమరావతి చాప్టర్ చైర్‌పర్సన్ డా. సాందీపని వజ్జే మాట్లాడుతూ, స్మార్ట్ విధానాలలో రాజధాని అమరావతి నిర్మాణంలో ప్లంబింగ్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణ, అగ్నిమాపక భద్రత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ ప్రమాణాల అమలుకు ఐపీఏ ఎల్లప్పుడూ సహకరిస్తుందని చెప్పారు.
ISHRAE విజయవాడ చాప్టర్ అధ్యక్షురాలు డా. పి. అనూష మాట్లాడుతూ, హెచ్‌వీఏసీ వ్యవస్థలు, శక్తి వనరుల పొదుపు, ఇండోర్ గాలి నాణ్యత, సుస్థిర భవనాల అభివృద్ధి వంటి అంశాలపై తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
APCRDA చీఫ్ ఆర్కిటెక్ట్ సందీప్ దీక్షిత్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అమరావతిలో సమర్థవంతమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ సంస్థలు, సాంకేతిక సంస్థలు, నిపుణుల మధ్య నిరంతర సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఐపీఏ నేషనల్ ట్రెజరర్ కాట్రగడ్డ భాస్కర్..నీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగించే ఆధునిక పంపింగ్ సాంకేతికతలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే డా. ఆనంద్ బాబు డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థలు, వాటి ప్రయోజనాలపై వివరించగా, గౌరవ్ ప్రపంచంలోని విజయవంతమైన డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్టుల ఉదాహరణలను వివరించారు. సురేష్ మురుగునీటి నిర్వహణ, ఆధునిక పంపింగ్ సాంకేతికతలపై తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ సదస్సు ద్వారా సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక, సుస్థిర యుటిలిటీ వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజారాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని మరోసారి APCRDA చాటిచెప్పింది.