13/09/2024
జిల్లా లో మెడికల్ పింఛన్లు పొందుతున్న 668 మందిలో 281మంది మెడికల్ పింఛన్లు పొందడానికి అనర్హులు..
281 మంది లో 255 మంది దివ్యాంగ పెన్షన్ల కు అర్హులు..26 మంది ఎటువంటి పింఛన్లు పొందడానికి అర్హులు కాదు..
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం ద్వారా మెడికల్ పింఛన్ల కింద 15 వేల రూపాయలు పొందుతున్న కారణంగా సుమారు గా ప్రతి నెలా 30 లక్షల రూపాయలు అదనంగా ప్రభుత్వంపై భారం..
క్షేత్రస్థాయి పరిశీలనల చేసి నివేదిక సమర్పించిన వైద్యాధికారుల బృందాలు..
అర్హత లేనప్పటికీ అర్హత ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం..
జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్.
జిల్లాలో మెడికల్ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు అధికంగా ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంచానికి లేదా వీల్ చైర్కే పరిమితమైన వారు, వారి బాగోగులు చూసుకునే వ్యక్తులు జీవనం గడపడానికి రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ పింఛన్ల కింద ప్రతి నెల 15 వేల రూపాయలు అందిస్తుందన్నారు. కొంతమంది వ్యక్తులు మెడికల్ బోర్డుల ద్వారా మంచానికే పరిమితమైనట్లు తప్పుడు దృవపత్రాలు పొంది అర్హత లేకపోయినా మెడికల్ పింఛన్లు పొందుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఐదు వైద్యాధికారుల బృందాలను నియమించి గత నెల రోజుల నుంచి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేశారన్నారు. ఒక్కో వైద్యాధికారుల బృందంలో ఒక ఆర్థోపెడిషియన్, మెడికల్ ఆఫీసర్, జనరల్ సర్జన్ ఉన్నారన్నారు.
ఈ వైద్యాధికారుల బృందాలు జిల్లా లో మెడికల్ పింఛన్లు పొందుతున్న 668 మంది ఇంటికి వెళ్లి మెడికల్ పింఛన్లు పొందుతున్న వ్యక్తులు అర్హులా కాదా అని పరిశీలించి నివేదిక సమర్పించారన్నారు.
మెడికల్ పింఛన్లు పొందుతున్న 668 మందిలో 374 మంది 15 వేల రూపాయల మెడికల్ పెన్షన్లు పొందడానికి అర్హులని తేలిందన్నారు. 255 మంది మెడికల్ పింఛన్లు పొందడానికి అనర్హులని కాని.. దివ్యాంగ పింఛన్లు 5 వేల రూపాయలు పొందడానికి అర్హులన్నారు. 26 మంది మాత్రం ఎటువంటి పెన్షన్లు పొందడానికి అర్హులు కాదని డాక్టర్ల బృందం నివేదించింది అన్నారు.
వైకల్యం కలిగి దివ్యాంగ పింఛన్లు పొందడానికి అర్హులై ఉండి మెడికల్ పింఛన్లు పొందడానికి అర్హత లేని 255 మందికి దివ్యాంగ పెన్షన్ల కింద 6 వేల రూపాయలు పింఛన్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సెర్ప్ కు నివేదించామన్నారు. ఎటువంటి పించను పొందడానికి అర్హత లేని 26 మందికి జిల్లాస్థాయిలోనే పింఛన్లు నిలిపివేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లను 3000 నుంచి 6000 రూపాయలకు .. మెడికల్ పింఛన్లను ఐదువేల నుంచి 15 వేల రూపాయలకు పెంచిందన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అధిక మొత్తంలో అర్హత లేకపోయినా పింఛన్లు పొందు తున్న కారణంగా జిల్లాలో ప్రతి నెల సుమారు గా 30 లక్షల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు.
అర్హత లేకపోయినా అర్హత ఉన్నట్లు సర్టిఫికెట్లు మంజూరు చేసిన రాజోలు, అమలాపురం, రాజమండ్రి కాకినాడ పరిధిలోని మెడికల్ బోర్డులలోని అధికారులపై విచారణ జరుపుతామన్నారు. డిఎంహెచ్ఓ, డి సి హెచ్ ఎస్, ఏరియా హాస్పిటల్ల సూపరిండెంట్ల తో కమిటీ ఏర్పాటు చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు మంజూరు చేసిన వైద్యాధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.