29/05/2026
“ఈ మౌనం యాదృచ్ఛికమా? లేక రాజకీయ అవసరాల కోసమేనా?”
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన రోజు అది కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు… అది ఒక అస్తిత్వ యుద్ధానికి వచ్చిన చారిత్రక ముగింపు. దశాబ్దాలుగా “మన భాష”, “మన యాస”, “మన నీళ్లు”, “మన ఉద్యోగాలు”, “మన సంస్కృతి”, “మన ఆత్మగౌరవం” కోసం పోరాడిన కోట్లాది తెలంగాణ ప్రజల ఆవేదనకు వచ్చిన న్యాయం. ఈ నేల మీద పుట్టి పెరిగిన ప్రతి మనిషి గుండెల్లో తెలంగాణా అంటే ఒక భావోద్వేగం. అది కేవలం మ్యాప్‌పై గీసిన సరిహద్దు కాదు… అది ఒక చరిత్ర, ఒక గాయం, ఒక తిరుగుబాటు, ఒక గర్వం.
కానీ ఇప్పుడు అదే తెలంగాణా ఆత్మపై మళ్లీ దాడి మొదలైందనే భావన ప్రజల్లో పెరుగుతోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ అధికారం లో ఉన్నంతకాలం మూలకు వెళ్లిన వలస రాజకీయ శక్తులు ఇప్పుడు కొత్త ముసుగులతో తిరిగి రంగంలోకి దిగుతున్నాయా అనే ప్రశ్న సాధారణ ప్రజల్లో వినిపిస్తోంది. తెలంగాణా భాషను, యాసను, సంస్కృతిని, సంప్రదాయాలను హేళన చేస్తూ… ఈ నేల ఆత్మను అర్థం చేసుకోలేని రాజకీయ తోలు బొమ్మలు మళ్లీ అధికార కుర్చీల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేల మనుషుల్ని “వెనుకబడినవాళ్లు”, “పాలన రాని వాళ్లు”, “సంస్కారం లేని వాళ్లు” అంటూ ఎగతాళి చేసిన వర్గాలే… ఇప్పుడు తెలంగాణా గద్దె మీద కూర్చొని తెలంగాణా ఆత్మను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయా అనే అనుమానం ప్రజల్లో బలపడుతోంది. ఉద్యమ కాలంలో తెలంగాణా యాసను సినిమాల్లో విలన్‌లకు, జోకర్లకు మాత్రమే పరిమితం చేసిన మనస్తత్వం… ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో బయటపడుతోందా?
ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణా మనిషి తన భాషను గౌరవంగా మాట్లాడుకునే హక్కు కోసం, తన యాసను గర్వంగా వినిపించే హక్కు కోసం మళ్లీ పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది?
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఒకప్పుడు కెసిఆర్ పాలనలో “ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది”, “వ్యక్తి స్వేచ్ఛ నశిస్తోంది”, “రాజ్యాంగ హక్కులు దెబ్బతింటున్నాయి” అంటూ ప్రతిరోజూ గళమెత్తిన సూడో మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు? అప్పట్లో ప్రతి చిన్న అంశంపై చర్చలు పెట్టిన వారు… ఇప్పుడు తెలంగాణా అస్తిత్వంపై జరుగుతున్న ఈ దాడులపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
తెలంగాణా భాషను అవమానించినప్పుడు వారి కలాలు ఎందుకు ఆగిపోయాయి? తెలంగాణా సంస్కృతిని హేళన చేసినప్పుడు వారి గొంతులు ఎందుకు మూగబోయాయి? తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వారి రాజ్యాంగ ప్రేమ ఎక్కడికి వెళ్లింది?
ఇప్పుడు మరో ముఖ్యమైన అనుమానం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది — ఇదంతా రాబోయే GHMC ఎన్నికల కోసమేనా? హైదరాబాద్‌ను కేవలం ఓటు బ్యాంకు గణితంగా చూసే రాజకీయ శక్తులు… మళ్లీ “వలస భావజాలం”ను రెచ్చగొట్టి తెలంగాణా అస్తిత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయా?
హైదరాబాద్ నగరం తెలంగాణ గుండె. ఈ నగరం మీద రాజకీయ ఆధిపత్యం సాధించాలంటే ముందుగా తెలంగాణా భావజాలాన్ని బలహీనపరచాలని కొన్ని శక్తులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయనే విమర్శ కొత్తది కాదు. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా ఇదే జరిగింది. హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి వేరు చేయాలనే కుట్రలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే రాజకీయ ఆలోచన కొత్త రూపంలో ముందుకు వస్తోందా?ఒక విషయం మాత్రం స్పష్టం. తెలంగాణా ప్రజలు రాజకీయంగా అమాయకులు కాదు. ఈ నేల ప్రజలు ఎన్నో అవమానాలు భరించి రాష్ట్రాన్ని సాధించారు. తమ భాష కోసం, తమ యాస కోసం, తమ గౌరవం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర తెలంగాణాదే. అలాంటి ప్రజలు మళ్లీ తమ అస్తిత్వాన్ని అవమానించే శక్తులను ఎంతకాలం సహిస్తారు?
తెలంగాణా అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదు. అది ఒక స్వాభిమానం. ఆ స్వాభిమానాన్ని అవమానించే ప్రతి ప్రయత్నం ప్రజల్లో తిరుగుబాటు మంటలను మళ్లీ రాజేస్తుంది. ఎందుకంటే తెలంగాణా ఉద్యమం కేవలం ఒకసారి ముగిసిన కథ కాదు. అవసరం వస్తే మళ్లీ మేల్కొనే సామూహిక చైతన్యం.
ప్రజలు ఇప్పుడు సమాధానాలు కోరుతున్నారు. తెలంగాణా అస్తిత్వంపై జరుగుతున్న ఈ దాడుల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు తెలంగాణా భాష, యాస, సంస్కృతి మళ్లీ టార్గెట్ అవుతున్నాయి? ఎందుకు కొన్ని మేధావుల గొంతులు ఇప్పుడు వినిపించడం లేదు? ముఖ్యంగా — GHMC ఎన్నికల రాజకీయ లాభాల కోసం తెలంగాణా ఆత్మగౌరవాన్ని బలి పీఠంపై పెడుతున్నారా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్నవారిపైనా ఉంది… మౌనం పాటిస్తున్న మేధావులపైనా ఉంది… ముఖ్యంగా తెలంగాణా ప్రజాసమాజంపైనా ఉంది.
ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని జయించడం సులువు కావచ్చు. కానీ ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని శాశ్వతంగా అణచివేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. తెలంగాణా చరిత్ర అదే చెబుతోంది.
కాసర్ల నాగేందర్ రెడ్డి
బీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా