14/03/2026
మతం గురించి ఐన్‌స్టీన్ ఏమన్నాడు?
ఐన్‌స్టీన్ దృష్టిలో దేవుడంటే ప్రకృతి, ప్రకృతి ధర్మాలు మాత్రమే! ఆయన అతీంద్రియ శక్తులను గానీ, క్రైస్తవ మతంలోని ట్రినిటీని గానీ, ఏసుక్రీస్తు మహిమలను గానీ, ఆత్మ అమరత్వాన్ని గానీ, గ్రహబలం గురించి గానీ ఎప్పుడూ నమ్మలేదు. 'దేవుడు ఈ విశ్వంతో ఎప్పుడూ ఆటలాడుకోడు' అని ఐన్‌స్టీన్ తరచుగా అంటుండేవాడు. విశ్వంలో యాదృచ్ఛికమైన గతులుండవు. గణిత సూత్రాలకు అనుగుణంగానే ప్రకృతి నడుస్తూ వుంది' అని కచ్చితమైన అభిప్రాయం ఉన్నవాడాయన. ఆయన మతం అనే మాటకు మరొక అర్థం చెప్పాడు. 'దేవుడితో సంబంధం లేకుండా మనిషి నైతికతతో మెలిగి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే' మతం అన్నాడు. ఆ అర్థంతోనే మతం అభిమతం మానవాళికి అవసరమన్నాడు.
అయితే ఈ అంశాన్ని ఆయన చెప్పిన స్థాయిలోకి వెళ్లి ఆలోచించాల్సి వుంటుంది. అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మతం, దేవుడు, అనే మూఢత్వంలో కొట్టుకుపోయే జనానికి ఈ విషయం అర్థం కావడం కష్టమే! అయితే అర్థం కానంత క్లిష్టమైంది కూడా కాదు. వంశపారంపర్యంగా జీర్ణించుకుంటూ వచ్చిన సనాతన భావజాలాన్ని కొంచెం పక్కన బెట్టి, మెదడులో ఏ మూలో దాక్కుని ఉన్న హేతువును నిద్ర లేపి, విశాల హృదయంతో కొంచెం కొత్తగా ఆలోచిస్తే చాలు, ఐన్‌స్టీన్ భావం మనకు అందుబాటులోకి వస్తుంది.
'మన ఈ మెటీరియలిస్టిక్ యుగంలో మానవాళి శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న, తపన పడుతున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వైజ్ఞానిక రచయితలే అత్యంత విశ్వసనీయమైన మతస్తులు' అని అన్నాడాయన. మళ్లీ ఈ అంశాన్ని కూడా అదే స్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాడుకలో ఉన్నట్లుగా మతస్థులు అనే పదాన్ని 'ఒక మతాన్ని నమ్మేవారు' అని అర్థం చేసుకోవాలని వైజ్ఞానిక స్పృహతో ప్రయత్నించే వారికి, తహతహలాడేవారికి తప్పక అర్థమౌతుంది. మౌఢ్యం గుంజకు తమను తాము కట్టేసుకున్న వారికి అర్థం కాకపోవచ్చు. బంధనాలను తెంచుకుని స్వేచ్ఛగా ముందుకొస్తే అర్థమవుతుంది. వ్యక్తులు ఊహించుకున్న 'దేవుణ్ణి' ఐన్‌స్టీన్ ఏనాడూ నమ్మలేదు. ఆ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో విస్పష్టంగా చెప్పారు కూడా! 'తను సృష్టించిన వాటిని తానే ఆదుకోలేక, మళ్లీ తనే శిక్షించే దేవుణ్ణి నేను ఊహించుకోలేను. హేతువును, భౌతిక శాస్త్ర సూత్రాలకు వ్యతిరేకంగా ఆయన చూపే లీలలను కూడా నేను ఊహించుకోలేను.
అసలు దేవుడంటే ఎవరు? మనిషి బలహీనతకు ప్రతిబింబం! మనిషి భయంలోంచి, అజ్ఞానంలోంచి, ఊహల్లోంచి, భ్రమల్లోంచి రూపుదిద్దుకున్న భగవంతుడు చూపిన లీలలకు, చూపాడని చెప్పుకుంటున్న మహిమలకు ఆధారాలే లేవు. అలాంటప్పుడు మనం వాటిని నమ్మేదెట్లా?' అన్నది ఐన్‌స్టీన్ సంధించిన ప్రశ్న!
దేవుడనే ఊహ-మానవ ప్రాథమిక శాస్త్రాల (రచనల) కల్పన. దాన్ని ఆయన ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. మానవాతీత శక్తిగా కూడా పరిగణించలేదు. అసంపూర్ణంగానైనా వినయంగా నమ్రతతో గ్రహించే ఈ విశ్వం క్రమబద్ధత, దాని సామరస్యంలోని అందం మానవాళిని ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆ ఆశ్చర్యాన్ని ఆనందించాలి. ఆస్వాదించాలి. అనుభవించాలి. ఐన్‌స్టీన్ అదే చేశాడు. అదే చేయమన్నాడు. అంతేకాని మరొకటి కాదు. మతానికీ శాస్త్రానికీ మధ్య జరుగుతున్న ఘర్షణకు మూలకారణం వ్యక్తిగత దైవ విశ్వాసం.
వైజ్ఞానిక శాస్త్రాలకు రుజువులున్నాయి. దైవ విశ్వాసానికి ఉండవు. రుజువులున్నదానితో రుజువులు లేనిది ఘర్షణ పడుతోంది. రుజువులు లేని దైవ విశ్వాసం అనేది లేకపోతే మానవులంతా వైజ్ఞానిక ప్రగతిని విశ్వసిస్తారు. అప్పుడు ఘర్షణ ఉండడానికి వీలుండదు. ఇప్పుడు సమాజం ఎలా వుందీ? వైజ్ఞానిక ప్రగతి ఫలితాలను అనుభవిస్తూ, దైవ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కదా! అందుకే ఘర్షణ జరుగుతోంది. వైజ్ఞానిక ఫలితాలు అనుభవించకుండా దైవ విశ్వాసంలో బతకగలిగితే బతకాలి. అప్పుడు కూడా ఘర్షణ ఉండదు. బాబాలు, స్వాములు, మాతాజీలు వగైరా సామాన్యుడి కన్నా ఎక్కువ వైజ్ఞానిక ఫలితాలు అనుభవిస్తున్నారు. మరో వైపు మూఢత్వం పెంచి పోషిస్తున్నారు. నైతికతను మరచి, అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఘర్షణ. పోనీ ఈ ఘర్షణ తగ్గించడానికి సైన్సును సైన్సు పరిశోధనలను పక్కన పెడదామా అంటే ఎలా వీలవుతుంది? సైన్సు లేకుండా ఊపిరే పీల్చలేం. శ్వాసక్రియ జీవశాస్త్రంలో ఒక భాగం. ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక ధోరణులలో ఎటునుంచి ఎటుతిప్పి చెప్పినా దైవ భావన-ఒట్టి విశ్వాసమే! ఈ విశ్వాసంతో సంతానోత్పత్తి జరగదు. ఆహారోత్పత్తి జరగదు. సమాజం పెరగదు. ఎదగదు.
విశ్వ రహస్యాలను జీవ రహస్యాలను మనిషి అర్థం చేసుకుంటూ ఒక్కొక్కటి ఆవిష్కరించుకుంటూ వస్తున్నాడు. కనుకనే, మనం ఈ అత్యాధునిక సాంకేతిక యుగంలో ఉన్నాం. మునుల వల్లనో, రుషుల వల్లనో, ధార్మిక ఆధ్యాత్మిక గురువుల వల్లనో ప్రపంచం పురోగతి సాధించలేదు. అలాగే మత విశ్వాసాల వల్ల ఘర్షణలు జరిగాయే గాని, శాంతి స్థాపించబడలేదు.
'ఎవరో నమ్ముకున్న దేవుడు లేడని నేనెందుకు నిరూపించాలి? అది నా పని కాదు. నమ్ముతున్న వారే, వారెందుకు నమ్ముతున్నారో నిరూపించుకోవాలి. దేవుడున్నాడని మాట్లాడితే నేనొక అబద్దాలకోరునవుతాను. అయినా, వాస్తవాలకు నిరూపణలు వెతకొచ్చు. అవాస్తవాలకు నిరూపణలెక్కడీ' అని ప్రశ్నించిన ఐన్‌స్టీన్ మత ప్రచారకులకు కొన్ని సూచనలు ఇచ్చాడు. 'మత ప్రచారకులంతా తమ వ్యక్తిగత దేవుడి సిద్ధాంతాన్ని వదిలేయాలి. తమ ఆధీనంలో ఉన్న పాప పుణ్యాలను, భయాలను, నిరాశావాదాన్ని. పునర్జన్మలను మొత్తానికి మొత్తంగా తుడిచేసుకోవాలి. నైతిక విలువలను కాపాడే పోరాటంలో సామాన్యులతో కలసి రావాలి. 'కార్యాకారణ సూత్రం'పై పని చేసే ఈ విశాల విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. జరిగిన జరుగుతున్న పరిణామాల మీద అవగాహన పెంచుకోవాలి. మతంపై నుండి దృష్టి మరల్చి, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టాలి'.
మానవుడి అమరత్వంపై తనకు నమ్మకం లేదని, నీతి అనేది మానవాతీత శక్తి కాదని, మానవుడికి సంబంధించిందేనని.. అది అతడు తన ఆత్మ విశ్వాసంతో సాధించుకోవచ్చని, ఈ విషయంలో దేవుడి ప్రమేయమే లేదని కరాఖండిగా చెప్పిన ఐన్‌స్టీన్ మరణానంతర జీవితాన్ని కొట్టి పారేశాడు. భౌతికంగా మనిషి చనిపోయిన తర్వాత జీవి బతికే ఉండడం ఆత్మలు తిరుగాడుతూ ఉండడం మూఢ నమ్మకాలేనన్నాడు. మనిషి అంతర్గత అనుభవాలన్నీ పునరుత్పత్తులతో, సునిశిత భావ సముచ్ఛయంతో ముడిపడి ఉంటాయి. దేహమే లేకపోయినప్పుడు ఆత్మకు అర్థమే లేదు. మానసికంగా బలహీనులైన వ్యక్తులు ఆత్మన్యూనతా భావంతోనూ, భయంతోనూ లేదా ఎదుటివారిని మోసగించాలన్న కుట్రతోనూ అలాంటి ఆలోచనలను ప్రచారం చేస్తుంటారు. లేని ఆత్మలను జనం గుండెల్లో పదిలపర్చుతుంటారు.
సరే, గతం గడిచిపోయింది. ఏం చేసినా దాన్నిక మార్చలేం కానీ, సుఖాంతమయ్యే ఒక కొత్త ప్రారంభానికి బీజం వెయ్యొచ్చుకదా! ఆ దిశలో మనం ఎందుకు ఆలోచించకూడదు? థియోసఫీ, స్పిర్చువలిజం వంటి వన్నీ మత గ్రంథాల చుట్టూ తిరిగే గందరగోళాలే! అసలు మత గ్రంథాలన్నీ అవాస్తవాలు, కల్పిత గాథలు అని అనుకున్న వారికి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశముంటుంది.
గానుగెద్దుల్లా కళ్లు మూసుకొని తిరిగే వారికి, అందులోనే శాంతి, సౌఖ్యం ఉన్నాయని అనుకునే వారికి మనం ఏమీ చెప్పలేం. వైజ్ఞానిక శాస్త్రం నైతికతను కించపరుస్తుందన్న అపవాదు వుంది. కానీ, అది నిజం కాదు! మానవుడి నైతిక ప్రవర్తన సానుభూతి, విద్య, వైద్యం, సామాజిక అవసరాలు, స్నేహ బంధనాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో మతానికి చోటే లేదు. అవసరమే లేదు. మత ప్రమేయం లేకుండా కూడా మానవులుగా, మహనీయులుగా గొప్ప విలువలతో జీవించిన వారున్నారు. మరణం తర్వాత లభించే అనుగ్రహం కోసమో, శిక్షలకు గురవుతామన్న భయంతోనో మనిషిని నిలదీయడం గానీ, కృంగదీయడం గానీ, మోసగించడం గానీ, అమానుషం! అపరిపక్వం! అసంబద్ధం!!
__✍️Devaraju Maharaju gaaru