01/09/2026
1008 మంది చిన్నారుల నోట వేమన పద్యాల గలార్చన
20కి పైగా పాఠశాలల విద్యార్థుల పాల్గొనడం.. మాతృభాష పరిరక్షణకు వినూత్న కార్యక్రమం
రావులపాలెం:
తెలుగు భాష పరిరక్షణ, భావితరాలకు మాతృభాషపై మమకారం పెంపొందించాలనే సంకల్పంతో ప్రగతి భారతం ట్రస్ట్, మాతృభాష పరిరక్షణ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ‘శతక పద్య సహస్ర గలార్చన – వేమన శతకం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 20కి పైగా పాఠశాలలకు చెందిన 1008 మంది చిన్నారులు పాల్గొని వేమన శతకంలోని 108 పద్యాలను కంఠస్థంగా ఆలపించి అబ్బురపరిచారు. చిన్నారులంతా ఎలాంటి తడబాటు లేకుండా పద్యాలను స్పష్టంగా, రాగయుక్తంగా పఠించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలుగు భాష గొప్పతనాన్ని, వేమన పద్యాల్లోని నీతి, సామాజిక సందేశాలను భావితరాలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంచడంతో పాటు, ప్రాచీన సాహిత్యాన్ని కంఠస్థం చేయడం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
పరీక్షలోనూ చిన్నారుల ప్రతిభ
కార్యక్రమంలో భాగంగా అతిథులు నిర్వహించిన పరీక్షలో 108 వేమన పద్యాలకు సంబంధించిన ప్రశ్నలకు చిన్నారులు సమాధానాలు ఇచ్చారు. పద్యం చెప్పమని అడిగినప్పుడు ఎలాంటి తడబాటు లేకుండా పూర్తిగా పద్యాన్ని చెప్పిన విద్యార్థులను అతిథులు అభినందించారు.
ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. చిన్నారుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రముఖుల హాజరు
ప్రగతి భారతం ట్రస్ట్ రావులపాలెం గ్రామం చైర్మన్ తవనంపూడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ సభ్యులు డాక్టర్ ఎస్. ఉమాశంకర్, డాక్టర్ ఎస్. రాజకుమారి, మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి సెక్రటరీ సీవీఎస్ నాగభూషణం మాస్టర్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు.
సభ ప్రారంభ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగింపు సభకు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు ఆనందరెడ్డి (బాబా) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వేయి గొంతులు కాదు.. వెయ్యికి పైగా చిన్నారుల గొంతుల్లో వేమన పద్యాలు మార్మోగడం ద్వారా తెలుగు భాష పరిరక్షణకు ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయక వేదికగా నిలిచింది.