01/06/2026
రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలు, అక్రమాలు మరియు అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ బాధితురాలు షేక్ హసీనాబీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి, బుట్టా ప్రతుల్ కలిసి కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి గారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా షేక్ హసీనాబీ మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించి, అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ చివరి దశలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ఉద్యోగం వచ్చినట్లు సమాచారం అందినా, అనంతరం ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా నియామక పత్రం ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తనలాంటి ఎందరో అభ్యర్థులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వారి భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరాని విషయమని అన్నారు.
అనంతరం కాటసాని శివ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది నిరుద్యోగ యువత జీవితాలకు సంబంధించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. మెరిట్ జాబితాల వెల్లడిలో పారదర్శకత లేకపోవడం, ఎంపిక ప్రక్రియపై అనేక సందేహాలు తలెత్తడం, అర్హులైన అభ్యర్థులు పక్కనపడటం వంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
డీఎస్సీ నియామకాల పేరుతో యువత ఆశలను, వారి కష్టాన్ని, భవిష్యత్తును బలిగొట్టే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం మౌనం పాటించడం మరింత అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ప్రశ్నాపత్రాల నిర్వహణ, ఫేక్ సర్టిఫికెట్ల వినియోగం, మెరిట్ ఎంపిక విధానం, ఉద్యోగాల కేటాయింపులో జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సీబీఐ లేదా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ నియామకాలలో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా యువతలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రం సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. “డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలి”, “డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి”, “నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు”, “అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఎద్దుల శివారెడ్డి, జిల్లా కార్యదర్శి మధు, ఎమ్మిగనూరు యువజన విభాగ అధ్యక్షులు డి. నజీర్ అహ్మద్, కోడుమూరు యువజన విభాగ అధ్యక్షులు ఎం.కే. వెంకటేష్, పాణ్యం యువజన విభాగ అధ్యక్షులు దుర్గ, పత్తికొండ యువజన విభాగ అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, పాణ్యం పబ్లిసిటీ విభాగ అధ్యక్షులు సాయి, ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బనవాసి బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు, నియామకాలలో జరిగిన ప్రతి అవకతవకపై నిజాలు వెలుగులోకి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని, నిరుద్యోగ యువత తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.
✊🔥