09/02/2022
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సూర్యాపేట ,ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోటెత్తిన నిరసనలు
నియోజకవర్గ కేంద్రం తో పాటు మండల కేంద్రాలలో దిష్టి బొమ్మలు దహనం ,
నల్ల చొక్కాలు,రిబ్బన్ లు ధరించి నిరసన
పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ
మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాల తో వేలాది గా కదిలిన టి.ఆర్.ఎస్ శ్రేణులు
*సూర్యాపేట*
ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మోదీకి వ్యతిరేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా తో పాటు సూర్యాపేట నియోజకవర్గం లో నిరసనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రం అయిన సూర్యాపేట పట్టణం తో పాటు పెన్ పహాడ్, చివ్వేంల,ఆత్మకూర్ ఎస్ ,సూర్యాపేట రూరల్ మండలాల్లో తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.భారీ ఎత్తున మోదీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టి బొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. వెంటనే ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బీజేపీ తన తీరు మార్చుకోకుంటే గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని నేతలు హెచ్చరించారు. మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రగతిని కోరాల్సిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై లేదా అని నేతలు ప్రశ్నించారు. విభజన హామీలను పరిష్కరించకుండా ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.