16/04/2022
100-108/2️⃣/సమతమూర్తి /తే.గీ.
101*(సంపూర్ణం)
కృష్ణ శైలాద్రి యాదాద్రి కీర్తి గుట్ట
యాద గిరి గుడి శిఖరాల యత్నఫలము
లక్ష్మి నృహరి దర్శన శుభ లబ్ధి గలిగె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
102*
జనులు తరతమబేధాలు సరకుగొనక
సామి శరణాగతిగ జాత్ర సాగు వేళ
మూడు చింతల వెలయు నీ మూర్తి పిలిచె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
103*
ఉడయ వరుడవు నాదిశేషుడవు నీవు
కదలి వాదాలు గెల్చిన కాలగురుడ!
సంస్కరణజేసి చూపిన సామ్య భావ
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
104*
జగతి నాచార్య త్రయమున సాగు చివరి
గురుడ జియ్యరు సాముల గొప్ప వరుస
ప్రథమ పరమగురుండవో పరమహంస!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
105*
సకలమెఱుక బొందెను తత్వ సారమెఱిగె
మోక్ష దాయక తిరుమంత్ర మొందె జగతి
దైవమును మెచ్చె నీసేవ ధన్య గురుడ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
106*
ఎంత బాధ్యత చేగొని వింత జగతి
నవతరించితి వో శేషనాగమూర్తి!
ఎంత సాధన భోధవేదాంత ప్రజ్ఞ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
107*
సామ్య వాదము జవ సత్వగమ్యమునకు
సాగె జీవకారుణ్యమే జగతి పొంగె
శుచియు శుభ్రత పౌష్టిక సూచి వెలసె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
108*
ఆత్మ వృత్తాన పరమాత్మ యలరుచుండ
శుభము సుఖశాంతి పాఠక శ్రోతలకును
శుభము గురులకు శిష్యశశ్రూషలకును!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
***
*16-4-2022. సమతమూర్తి శతకము సంపూర్ణం...
***🙏***✍️💫