23/05/2026
భగభగ మండుతున్న ఎండలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ పాలకొల్లు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అలసత్వం కారణంగా తరచూ జరుగుతున్న కరెంట్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు చీకటిలో మునిగిపోతుండగా, ఉక్కపోతతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని వాపోతున్నారు.
ప్రజల ఆవేదన...
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని వేడంగిపాలెం, కుమ్మరిపాలెం, జిన్నూరుపాలెం, వడ్లవానిపాలెం, పెచ్చెట్టిపాలెం, గొల్లవానిచెరువు, చింతలపాలెం గ్రామాల్లో విద్యుత్ కోతలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పగలంతా కష్టపడి ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రివేళ కరెంట్ లేక ఉక్కపోత, దోమల బెడదతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెబుతున్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రతిసారి అధికారులను సంప్రదిస్తే “లైన్ ట్రిప్ అయింది”, “మరమ్మతులు జరుగుతున్నాయి” అనే సమాధానాలే వస్తున్నాయని, కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తరచూ ఒకే కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప, విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు కనిపించడం లేదని మండిపడుతున్నారు.
ముఖ్యంగా పసిపిల్లలు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. రాత్రివేళ విద్యుత్ లేక చిన్నారులు ఏడుస్తుండగా, పెద్దలు ఉక్కపోతతో అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాలకొల్లు నియోజకవర్గంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.